తెలంగాణలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్ల సైబర్ మోసం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు సమీపంలో శనివారం ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బొప్పన ఖాదర్ బాబా, బొప్పన నాగ పవన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు, అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేరాల నెట్‌వర్క్‌తో ఈ కేసుకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 55కు చేరింది.
రూ.వెయ్యి కోట్లకు సంబంధించిన ఈ భారీ సైబర్ మోసం వెనుక ఉన్న కీలక వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు, అంతర్జాతీయ నెట్వర్క్ వివరాలను వెలికితీసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
