మనం ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసి తాగే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితమేనా? అంటే తాజాగా వెలువడిన నివేదికలు సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖ వాటర్ బాటిల్ బ్రాండ్ ‘బిస్లరీ’ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్ నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) సంచలన ప్రకటన చేసింది. ఈ నీరు తాగడానికి ఏమాత్రం సురక్షితం కాదని తేలడంతో వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే, ఇటీవల సేకరించిన బిస్లరీ మంచినీటి నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నీటిలో ఉండాల్సిన నిర్ణీత ప్రమాణాల కంటే అత్యధిక మోతాదులో ‘బ్రోమేట్’ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. అంతేకాకుండా, ఆరోగ్యానికి అత్యంత హానికరమైన ‘పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (PAHs) కూడా ఈ నీటి శాంపిల్స్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నివేదికల ఆధారంగా సదరు కంపెనీపై కఠినమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు FSSAI అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.
నీటిలో గుర్తించిన ఈ రసాయనాల ప్రభావంపై వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్రోమేట్ మరియు PAHs వంటి రసాయనాలు శరీరంలోకి చేరితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, ఇవి కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రోజువారీ ప్రయాణాల్లో, శుభకార్యాల్లో అత్యధిక మంది వినియోగించే బ్రాండెడ్ వాటర్ బాటిళ్లలోనే ఇలాంటి ప్రమాదకర అవశేషాలు బయటపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
