ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. చిలకలూరిపేట పరిధిలోని నాదెండ్ల మండలం తిమ్మాపురంలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పావులూరి శ్రీనివాసరావుకు చెందిన కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు.
సదరు కంపెనీలో మారణాయుధాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కర్రలు బయటపడినట్లు సమాచారం. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించి పావులూరి శ్రీనివాసరావుతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు కంపెనీలో కర్రలను ఎందుకు నిల్వ ఉంచారు? వాటి వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణ పూర్తయితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
