-
రూ.250 కోట్ల విలువైన ఆభరణాలు
-
గోప్యంగా భక్తుడి పేరు
-
అంతటా ఇప్పుడు ఇదే చర్చ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామివారికి ఒక అజ్ఞాత భక్తుడు సమర్పిస్తున్న భారీ బంగారు ఆభరణాల విరాళం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇప్పుడు దీని పైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. సేవా తత్పరత కలిగిన ఆ భక్తుడు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే సదరు భక్తుడు ఒక ప్రముఖ స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకుడు అని.. ఇటీవల తన కంపెనీలోని కొంత వాటాను విక్రయించగా వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. తనకు లభించిన ఈ అపారమైన సంపదకు కృతజ్ఞతగా.. శ్రీవారి నిత్య పూజలు, సేవల్లో వినియోగించే అత్యంత విలువైన స్వర్ణాభరణాలను స్వయంగా చేయించి.. స్వామివారికి సమర్పించాలని ఆయన సంకల్పించారు. ఈ విరాళం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది. సుమారు 120 కేజీలకు పైగా బంగారంతో అత్యంత సుందరంగా ఈ ఆభరణాలను తయారు చేయించారు..
వేల కోట్ల ఆదాయం రావడంతో…
అయితే ఈ భక్తుడి భారీ విరాళం పై అప్పుడే ప్రచారం మొదలైంది. గతంలోనే ఒకసారి సీఎం చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. పరోక్షంగా ప్రస్తావించారు. తన సంస్థ వాటా అమ్మకం ద్వారా వేలకోట్లు సంపాదించిన ఒక యువ పారిశ్రామికవేత్త, శ్రీవారికి నిత్య పూజలకు వాడే సమస్త బంగారు ఆభరణాలను చేయించి ఇవ్వడానికి ముందుకు వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. కేవలం దైవ భక్తితోనే ఈ కైంకర్యం చేస్తున్నానని.. తనకు ఎలాంటి పబ్లిసిటీ లేదా గుర్తింపు అక్కర్లేదని సదరు భక్తుడు స్పష్టంగా కోరుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తన పేరు ఎక్కడా బయటకు రాకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ బంగారు కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించేలా ఏర్పాట్లు జరిగాయి.
కొన్ని నిబంధనలు…
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు ఇచ్చే దాతల పేర్లను టీటీడీ అధికారికంగా ప్రకటిస్తుంది. వారికి ప్రత్యేక దర్శనాలు, సన్మానాలు వంటి ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ నిజమైన భక్తి భావంతో కుడిచేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అనుకునే దాతలు కోసం టీటీడీ నిబంధనల్లో ప్రత్యేక వెసులుబాటు ఉంది. విరాళం ఇచ్చే భక్తులు తమ వివరాలు బయటకు రాకూడదని కోరుకుంటే.. టీటీడీ వారి పేర్లను పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది. ఇదే నిబంధనను అనుసరించి.. స్టార్టప్ కంపెనీ యజమాని తన పేరును రహస్యంగా ఉంచుతూ శ్రీవారి సేవలో తరిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ విరాళం ఇచ్చే భక్తుడు అజ్ఞాతంగా ఉండాలని కోరుకుంటూ టీటీడీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఆ విరాళానికి సంబంధించి పత్రికా ప్రకటనల్లో దాత పేరు, ఊరు లేదా ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయదు. కేవలం ఒక అజ్ఞాత భక్తుడు అని మాత్రమే పేర్కొంటుంది. లక్ష రూపాయల నుంచి కోటి రూపాయలు.. అంతకంటే పెద్ద మొత్తం ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక దర్శనాలు, వసతి, బహుమానాలు ఇస్తుంది. అయితే అజ్ఞాతదాతగా విరాళం ఇచ్చేవారు ఈ ప్రోటోకాల్ సదుపాయాలను స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుంది. అయితే దాత పేరును ప్రజలకు, మీడియాకు గోప్యంగా ఉంచినప్పటికీ.. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను, మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం 50 వేల రూపాయల కంటే ఎక్కువ విరాళం ఇచ్చేటప్పుడు.. టీటీడీ రికార్డుల కోసం దాత పాన్ కార్డు లేదా ఆధార్ వివరాలు తప్పనిసరి. ఈ వివరాలు కేవలం టిటిడి ఆడిట్, ఆదాయపు పన్ను శాఖ అవసరాల కోసం అత్యంత భద్రంగా ఉంచుతారు. బయటకు వెల్లడించరు.
