హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: బెంగాల్లో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను అమలు చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకంగా ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తామన్న అంశంపై సీఎం సువేందు అధికారి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా బెంగాల్లో ఉంటున్న వలసదారులు వెళ్లిపోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే పారిపోండి అంటూ ఆయన స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే బెంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో విజయం సాధించి కొన్ని వారాలు కూడా దాటక ముందే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులపై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్ వలసదారులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సువేందు అధికారి ప్రభుత్వం తాజా చర్యలతో స్పష్టం చేసింది.
ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం సువేందు అధికారి…
పశ్చిమ బెంగాల్లో ఉంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులను ఉద్ధేశించి సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టంతో కాకుండా ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టం కిందే ఈ చర్యలు తీసుకోబుతున్నట్టు స్పష్టం చేశారు. తక్షణం అక్రమ వలసదారులు ఈ దేశాన్ని వదిలి వెళ్లాలన్న ఆయన.. తమ పౌరులను వెనక్కి తీసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి బంగ్లాదేశ్ ఇప్పటికే ఓకే చెప్పిందన్న ఆయన.. బంగ్లా అక్రమ చొరబాటుదారులను జైళ్లకుపంపవద్దని తాను పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు సువేందు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మరిన్ని హాట్ కామెంట్స్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన వారికి మనమెందుకు ఆతిథ్యం ఇవ్వాలన్న ఆయన.. వాళ్లేమైనా అల్లుళ్లా అంటూ ప్రశ్నించారు. బంగ్లా పౌరులు స్వచ్చంధంగా, వేగంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం సువేందు అధికారి హెచ్చరికలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బెంగాల్లో అనేక ప్రాంతాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులు వెనక్కి మళ్లుతున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలతో పూర్తిగా బెంగాల్ ప్రక్షాళన అవుతుందని పలువురు బీజేపీ నాయుకులు పేర్కొంటున్నారు.