క్రైం మిర్రర్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన రాజ్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టగా, వారు దానిని స్వీకరించేందుకు నిరాకరించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ మేరకు వారు పోలీసులకు లేఖ అందజేయడంతో, అధికారులు తదుపరి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించారు.
బంధువులు మృతదేహాన్ని స్వీకరించకపోవడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం చేవెళ్ల శ్మశానవాటికను ఎంపిక చేసినట్లు సమాచారం. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తైన అనంతరం పోలీసుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసులో సెల్ఫీ వీడియో, చేతిరాత నోట్, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించడం కేసులో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
also read : షాబాద్ ఆరుగురు హత్యల కేసులో కొత్త మలుపు.. నాలుగు పేజీల బాండ్ పేపర్ నోట్ స్వాధీనం