క్రైం మిర్రర్ : హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చార్మినార్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత (47) మృతి చెందారు. అల్వాల్ పరిధిలోని మచ్చబొల్లారం సాయిబాబా నగర్‌లో ఉన్న హేమచంద్ర రెసిడెన్సీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
గత కొంతకాలంగా చంద్రశేఖర్, హేమలత దంపతుల మధ్య కుటుంబపరమైన సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వీటితో పాటు హేమలతకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేందుకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హేమలత ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలు పూర్తిస్థాయి విచారణ తర్వాత వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు, పరిచయస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
also read : పోస్ట్‌మార్టం పూర్తి.. రాజ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబం నిరాకరణ