క్రైం మిర్రర్ : దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ బయటపడింది. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన కొందరు మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్మా గ్రామం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవుల్లో దాచిపెట్టిన భారీ డంప్‌ను గుర్తించారు. డంప్‌లో పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నగదు, బంగారం లభించినట్లు అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు 116 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.16 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే రూ.2 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
డంప్‌లో ఆయుధాల పరంగా కూడా భారీ నిల్వలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఇన్సాస్ రైఫిల్, నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఐదు 12 బోర్ గన్లు, మూడు బీజీఎల్ లాంచర్లు, పలు తుపాకులు లభించినట్లు పేర్కొన్నారు.
ఇవే కాకుండా ఆరు టిఫిన్ బాంబులు, 122 బాణం బాంబులు, నాలుగు పైపు బాంబులు, కంట్రీ మేడ్ గ్రెనేడ్లు, మోర్టార్ పరికరాలు, జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, రివాల్వర్లు, ఎయిర్ గన్లు, లోడ్ చేసిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మావోయిస్టుల కదలికలు, ఆయుధాల నిల్వలపై అందిన సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని పరిశీలిస్తూ, ఈ డంప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
also read : కుటుంబ కలహాలతో పోలీస్ అధికారి భార్య ఆత్మహత్య..