హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గడ్డుకాలం నడుస్తోంది. కొన్నేళ్లపాటు బెంగాల్‌ను ఏలిన కమ్యూనికస్టుల కంచుకోటను బద్దలు కొట్టి అధికారాన్ని దక్కించుకున్న ఆమె 15 ఏళ్లపాటు అప్రతిహాతంగా రాష్ట్రాన్ని ఏలారు. అయితే, కొద్దిరోజులు కిందట జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక్కడ బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మమతా బెనర్జీకి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు అధికారాన్ని చెలాయించిన ఆమె తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
పార్టీని తన కనుసైగలతో కొన్నేళ్ల నుంచి నడుపుకుంటూ వస్తున్న ఆమె మాటను బేఖాతరు చేసే స్థాయికి కొంత మంది నాయకులు చేరుకోవడం ఆ పార్టీని మరింత చిక్కుల్లోకి నెడుతోంది. తాజాగా ఎన్నికల్లో ఓటమి తరువాత కొంత మంది ముఖ్య నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిదే టీఎంసీలో అంతర్గత సంక్షోబానికి కారణమవుతున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా పలువురు లోక్‌సభ ఎంపీలు బీజేపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే బెంగాల్లో టీఎంసీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండనుంది.
సన్నిహిత నేతలే ఫిరాయింపులకు రెడీ…
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులే బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం టీఎంసీకి లోక్‌సభలో 29 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 12 మంది ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిగా పేర్కొంటున్నారు. అయితే, బెంగాల్లో పూర్తిగా టీఎంసీ ప్రభావాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం వలసలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
సుమారు 20 మంది ఎంపీలను టీఎంసీకి వ్యతిరేకంగా చేసి బీజేపీలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి టీఎంసీలోని ముఖ్య నాయకులే నడుం కట్టినట్టు చెబుతున్నారు. అలాగే, రాజ్యసభ ఎంపీలను కూడా బీజేపీలో విలీనం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం టీఎంసీకి రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. మెజార్టీ ఎంపీలు పార్టీ మారి విలీనం ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే, మమతా బెనర్జీ ఈ వ్యవహారంపై ఇప్పటికే దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఆమె అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ చేజారిపోకుండా చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి. ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులతో టీఎంసీకి చెందిన 12 మంది లోక్‌సభ, నలుగురు రాజ్యసభ ఎంపీలు టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మరి కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.