Homeఆంధ్ర ప్రదేశ్పార్టీ ముఖ్య నాయకులతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ... సర్వత్రా నెలకొన్న ఆసక్తి...!

పార్టీ ముఖ్య నాయకులతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ… సర్వత్రా నెలకొన్న ఆసక్తి…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఉంది. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు పిలుపు అందింది.

దీంతో రాష్ట్రంలోని నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించే కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకుంటారని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం గత కొన్నాళ్లుగా తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, పార్టీ ముఖ్య నాయకులపై పెడుతున్న కేసులు, పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు వంటి విషయాలపై జగన్‌ ఈ సమావేశంలో కూలంకుషంగా ముఖ్య నాయకులకు వివరించే అవకాశం ఉంది.

పార్టీ కమిటీల నియామకంపై.. .

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. అయితే, పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీల నియామక ప్రక్రియను ప్రారంభించారు. అలాగే, పూర్తిస్థాయిలో గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయడంపైనా ఈ సమావేశంలో కీలకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన తరహాలోనే పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా, ఇతర సదుపాయాలను కల్పించేందుకు జగన్‌ సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఈ సమావేశంలో దీనిపై జగన్‌ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే, స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో దీనిపైనా కీలక సూచనలు చేయనున్నారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడంపై నాయకులు దృష్టి సారించాలని, ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా జగన్‌ చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రభుత్వ విధానాలపై గ్రామ స్థాయి నుంచి పోరాటాలు సాగించేలా నాయకులకు దిశా, నిర్ధేశం చేయనున్నారు. పోలీసులు, కూటమి పార్టీ నాయకులు వేధింపులతో ఇబ్బందులు పడే కేడర్‌కు అండగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు