•తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
•ఉడికించేస్తున్న వడగాలులు
•మరో మూడు రోజులపాటు ఇలానే అంటున్న వాతావరణ శాఖ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణ ఉడికిపోతుంది. ఎండ ప్రచండంగా మారుతోంది. భానుడి దెబ్బకు రాష్ట్రం వణికిపోతోంది. వడదెబ్బకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండడంతో జనం విలువలాడుతున్నారు. వరుసగా రెండో రోజు వడదెబ్బతో 30 మందికి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. శనివారం వడదెబ్బకు 40 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, కూలీలే ఉన్నారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతుండడంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు దాటుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల..
తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఒకేలా ఉంది. 46 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు ఉష్ణోగ్రత తగ్గడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. 4782 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదయింది. రోజువారి విద్యుత్ వినియోగం 101. 70 మిలియన్ యూనిట్లుగా రికార్డు అయింది. వడదెబ్బతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 19 మంది మృత్యువాత చెందారు. మిగతా నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సైతం ఎండ దెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక మూగజీవాల గురించి చెప్పనవసరం లేదు.
వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో ఐదు ఆరు జిల్లాలను మినహాయిస్తే.. అన్నిచోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో తీవ్రస్థాయిలో వడగాలులు వీచాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని వార్తలు వచ్చాయి. దీంతో ప్రజలు రుతుపవనాలపై ఆశలు పెట్టుకున్నారు. కేరళకు రుతుపవనాలు తాకితేనే దేశవ్యాప్తంగా వర్షాలు ప్రారంభం అవుతాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు వర్షాలు జాడలేదు. అడపాదడపా పడుతున్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతోంది వర్షం. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతుండడం.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.