క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లో అప్పు చెల్లించకుండా తప్పించుకోవాలన్న ఆలోచన ఓ జంటను దారుణానికి పాల్పడేలా చేసింది. బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి తీసుకున్న రూ.6 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించకుండా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ మేనేజర్‌ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సబర్కాంత జిల్లాలోని ప్రాంతిజ్ ప్రాంతానికి చెందిన భావన అలియాస్ భావు ఠాకూర్, యోగేష్ ఠాకూర్ కొంతకాలంగా ప్రేమ సంబంధంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థలో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. భావన రూ.1.50 లక్షలు, యోగేష్ రూ.4.50 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అప్పు చెల్లించకుండా బంగారాన్ని తిరిగి పొందేందుకు మేనేజర్ భరత్ చౌదరిని హత్య చేయాలని ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 2న డబ్బులు ఇస్తానని చెప్పి భరత్‌ను ప్రాంతిజ్‌కు రావాలని భావన కోరినట్లు సమాచారం. ఆమె మాటలు నమ్మిన భరత్‌ను యోగేష్ తన కారులో మన్సా నుంచి తీసుకెళ్లాడు. వద్వాసా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కారులోనే యోగేష్ భరత్‌పై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో తేలింది.
అనంతరం మృతదేహాన్ని కారులోనే ఉంచి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయాలని నిందితులు భావించారు. లిమ్లా గ్రామం వైపు వెళ్తుండగా కారును వెనక్కి తీసే క్రమంలో అది రహదారి పక్కన ఉన్న కాలువలో ఇరుక్కుపోయింది. వాహనం అక్కడి నుంచి కదలకపోవడంతో నిందితులు భయపడి మృతదేహాన్ని కారులోనే వదిలేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ భరత్ చౌదరిగా గుర్తించారు. ఆయన మెడపై గాయాలు ఉండటంతో హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ వివరాలను పరిశీలించిన పోలీసులు భావన, యోగేష్‌ల ప్రమేయాన్ని గుర్తించారు. అనంతరం భావనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న యోగేష్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
also read : కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
