Homeసినిమాహింసకు సినిమాలే కారణమా? రాప్తాడు ఘటనపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

హింసకు సినిమాలే కారణమా? రాప్తాడు ఘటనపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

సినిమాల్లో చూపించే హింసాత్మక సన్నివేశాలు యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో సినిమాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. సమాజంలో నేరాలు పెరగడానికి సినిమాలే కారణమని ఆరోపించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆదివారం తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని రామాయణాన్ని నిందించడం ఎంతవరకు సమంజసం కాదో.. సమాజంలో హింస పెరుగుతోందని సినిమాలను బాధ్యులుగా చేయడం కూడా అంతే తప్పని వ్యాఖ్యానించారు. సినిమాలపై వస్తున్న విమర్శలు సరైన కోణంలో లేవని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రాప్తాడు పాఠశాల ఘటనతో మొదలైన చర్చ

అనంతపురం జిల్లా రాప్తాడులోని ఓ పాఠశాలలో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. 21 ఏళ్ల యువకుడు పదో తరగతి తరగతి గదిలోకి ప్రవేశించి, 15 ఏళ్ల బాలికపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేశాడు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు బాధితురాలికి బంధువని, గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం.

తీవ్రంగా గాయపడిన బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘యానిమల్‌’ సన్నివేశంపై విమర్శలు

ఈ ఘటన అనంతరం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘యానిమల్‌’ చిత్రంలోని ఓ సన్నివేశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో హీరో ఏకే-47 తుపాకీతో పాఠశాల తరగతి గదిలోకి ప్రవేశించే సన్నివేశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

సినిమాల్లో హింసను ఆకర్షణీయంగా చూపించడం వల్ల యువతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హింసను పురుషత్వానికి ప్రతీకగా చూపించడం సరికాదని విమర్శిస్తున్నారు. మరోవైపు, తెరపై చూపించే సన్నివేశాలకు సమాజంలో జరిగే నేరాలకు నేరుగా సంబంధం ఉందని చెప్పలేమని మరికొందరు వాదిస్తున్నారు.

సందీప్‌ రెడ్డి వంగాకు ఆర్జీవీ మద్దతు

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సినిమాల శైలిని రామ్‌గోపాల్‌ వర్మ గతంలోనూ పలుమార్లు ప్రశంసించారు. తాజాగా ‘యానిమల్‌’ సినిమా సన్నివేశంపై విమర్శలు వస్తున్న సమయంలోనూ ఆయన స్పందన చర్చకు దారితీసింది. సినిమాల్లో హింసను చూపించడం, వాస్తవ జీవితంలో నేరాలు జరగడం రెండింటినీ ఒకే కోణంలో చూడకూడదన్నది ఆర్జీవీ వ్యాఖ్యల సారాంశం.

రాప్తాడు ఘటనతో మొదలైన ఈ చర్చలో సినిమా దర్శకుల బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ, యువతపై సినిమా ప్రభావం వంటి అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

also read: శాతవాహన విశ్వవిద్యాలయంలో విషాదం.. ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు