క్రైమ్ మిర్రర్ : దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. భార్యతో తన పొరుగింటి వ్యక్తికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడిని హత్య చేసి అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న నిందితుడిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సుమారు 28 ఏళ్ల పాటు తన గుర్తింపును దాచుకుంటూ వివిధ ప్రాంతాల్లో నివసించిన నిందితుడు విశ్వనాథ్ సింగ్ అలియాస్ మున్నా (62) పోలీసులకు పట్టుబడ్డాడు.
ఈ ఘటన 1998 అక్టోబర్ 20న ఢిల్లీలోని గోకల్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. జై ప్రకాశ్ (24) అనే యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. తొలుత ఈ ఘటనను పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేశారు. అయితే తదుపరి విచారణలో ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.
విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. జై ప్రకాశ్ తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం విశ్వనాథ్ సింగ్‌కు కలిగింది. ఈ కారణంగా అతడిపై కక్ష పెంచుకున్న నిందితుడు సుత్తితో జై ప్రకాశ్ తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటన అనంతరం నిందితుడు పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. 2000 సంవత్సరంలో పోలీసులు రోడ్డు ప్రమాదం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తును ముమ్మరం చేశారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు.
చివరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ పాత కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న నిందితుడి స్వగ్రామాన్ని గుర్తించి, అతడి కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో విశ్వనాథ్ సింగ్ తన సోదరులను రహస్యంగా కలుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా మరింత పెంచిన పోలీసులు అక్టోబర్ 30న ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 28 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్టుతో పాత హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
also read: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు మరో చిక్కు.. సిద్దిపేటలో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు
