నెల్లూరు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న వాకాటి శ్రీనివాసులు రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం జారీ చేసిన ఈ నోటీసుల్లో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేశారు.
పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్‌లో అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు నమోదైన కేసులో వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఏ3 నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. గతంలో ఆయన పొదలకూరు ఉప సర్పంచిగా కూడా పనిచేశారు.
ఈ అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా, తాజాగా వాకాటి శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు జారీ కావడం మరోసారి చర్చకు దారితీసింది.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
also read: ‘ఇరుముడి’ చిత్రానికి కొత్త చిక్కులు.. మైత్రీ మూవీ మేకర్స్‌కు కార్మిక శాఖ నోటీసులు!
