క్రైమ్ మిర్రర్ : స్నేహితులతో కలిసి సరదాగా ఆదివారం సెలవు రోజు గడపాలనుకున్న ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఈ ఘటనతో యాప్రాల్ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్ ప్రాంతానికి చెందిన రోహిత్ (18), సీవీఆర్ కళాశాలలో చదువుతున్న సయాన్ (18), సీఎంఆర్ కళాశాల విద్యార్థులు రక్షిత్, పియూష్, మురారి కలిసి ఆదివారం విహారానికి వెళ్లారు. మల్కారం పరిధిలోని ఓ క్వారీ గుంతల ప్రాంతంలో కొంతసేపు గడిపారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం సమీపంలోని క్వారీ గుంత వద్ద ప్లేట్లు శుభ్రం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
సమాచారం అందుకున్న జవహర్నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన విద్యార్థుల కోసం హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెలవు రోజున ఆనందంగా గడపడానికి వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లడం స్థానికులను కలచివేసింది.
also read : అబ్బాయి కావాలంటూ దారుణం.. అక్రమ లింగ నిర్ధారణ, బలవంతపు అబార్షన్తో 24 ఏళ్ల యువతి మృతి!
