తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించే హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్‌లోని బీసీ కాలనీలో జోగినిగా గుర్తింపు పొందిన సుధాకర్ (50) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
హత్య అనంతరం నిందితులు ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకెళ్లారు. అంతేకాకుండా ఇంట్లోని సీసీటీవీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను కూడా తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మృతుడికి చెందిన కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు తీసుకెళ్లిన కారుకు అమర్చిన జీపీఎస్ పరికరం ఆధారంగా వారి కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో పట్టుబడిన వ్యక్తులు అసోం రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ హత్య వెనుక గల కారణాలు, నిందితుల పాత్ర, దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన చౌటుప్పల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
also read: అక్రమ మైనింగ్ కేసులో కీలక పరిణామం.. కాకాణి అనుచరుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డికి పోలీసుల నోటీసులు!
