హైదరాబాద్ నగరంలో మహిళల అండాలను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేద మహిళల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని, వారికి డబ్బు ఆశ చూపి అండాలను సేకరిస్తున్న ఈ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి 43 మంది మహిళలను పోలీసులు రక్షించగా, ముఠాతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
బేగంపేట్, సరూర్‌నగర్ పోలీసులు, మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. ప్రకాశ్ నగర్, బేగంపేట్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో పలు చోట్ల ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలను గుర్తించారు.
పోలీసుల విచారణలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పేద మహిళలను ఏజెంట్ల ద్వారా హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడైంది. ఒక్కోసారి అండాల సేకరణకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తామని నమ్మించి వారిని ఈ వ్యవహారంలోకి దించుతున్నట్లు గుర్తించారు. నగరంలోని అద్దె ఇళ్లలో మహిళలకు వసతి కల్పించి, ఫెర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు, అండాల సేకరణ ప్రక్రియ కోసం తమకు హార్మోన్ల ఇంజెక్షన్లు, మందులు బలవంతంగా ఇస్తున్నారని బాధిత మహిళలు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులు అక్రమ రాకెట్లో మహిళల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతున్న పరిస్థితులను బయటపెట్టాయి.
దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో హార్మోన్ల ఇంజెక్షన్లు, సిరంజిలు, మాత్రలు, మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడిగా అనుమానిస్తున్న అమిత్ శర్మ (44), మహిళల నియామక బాధ్యతలు చూసినట్లు భావిస్తున్న నిక్కత్ పర్వీన్ (31)తో పాటు ఏజెంట్లు, ఏఆర్టీ బ్యాంక్ మేనేజర్ సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు అమిత్ శర్మ ప్రకాశ్ నగర్లో నెలకు రూ.50 వేల అద్దె చెల్లిస్తూ గత రెండేళ్లుగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. మహిళల పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు, అఫిడవిట్లు, అంగీకార పత్రాలు తయారు చేసి ఈ వ్యవహారాన్ని కొనసాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ అక్రమ వ్యవహారం వెనుక మరికొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బేగంపేట్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ అక్రమ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఎన్ని ఫెర్టిలిటీ కేంద్రాలకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.
also read: యాదాద్రి జిల్లాలో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదుతో దుండగుల పరారీ!
