జార్ఖండ్‌లో మానవత్వాన్ని మంటగలిపే విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల వద్దు.. మగబిడ్డే కావాలన్న మూఢనమ్మకంతో ఓ యువతి ప్రాణాలను బలిగొన్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్ష చేయించడంతో పాటు, బలవంతంగా అబార్షన్ చేయించడంతో 24 ఏళ్ల వివాహిత ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా శ్యామ్డీ చౌక్‌కు చెందిన కిరణ్ కుమారి ఈ దారుణానికి బలయ్యారు. అబ్బాయి కావాలన్న ఉద్దేశంతో ఆమె భర్త సోనూ కేవత్, అత్తింటివారు అక్రమ లింగ నిర్ధారణ పరీక్ష చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం స్థానికంగా ఉన్న సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించినట్లు సమాచారం.
ఆ తర్వాత మరో ప్రైవేట్ క్లినిక్‌లో కిరణ్ కుమారికి అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ఆమెకు తీవ్రస్థాయిలో రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. చివరకు చికిత్స పొందుతూ కిరణ్ కుమారి ప్రాణాలు విడిచారు.
ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని జుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఆడపిల్ల, మగపిల్లాడనే వివక్షతో మహిళల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతటి దారుణమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, బలవంతపు అబార్షన్ల వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
also read: మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు.. నల్గొండలో దారుణం!
