దేశంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించి జైలుకు పంపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీ వంతే మోదీజీ’’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్ కుమార్ పాత్ర లేకపోతే మోదీ ప్రధాని, అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయ్యేవారు కాదని ఆరోపించారు.
ఓట్ల చోరీ జరుగుతోందంటూ ఆరోపణలు
దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం, అనర్హుల పేర్లను చేర్చడం వంటి చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈవీఎంల వినియోగంలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా 15 శాతం మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ, ప్రజల తీర్పును అపహాస్యం చేశారని విమర్శించారు. ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించడం ప్రజాస్వామ్యానికి, దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగించే చర్యగా అభివర్ణించారు.
సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని విమర్శ
దేశంలోని సంపద కొద్దిమంది సంపన్నుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించాలని, విద్యావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు, కార్మికులు, రైతులు, యువతకు తగిన హక్కులు, అవకాశాలు అందడం లేదని విమర్శించారు.
భారతదేశం ఇద్దరు ముగ్గురు సంపన్నుల సొత్తు కాదని, దేశంలోని ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తూ, తమ శ్రమకు తగిన ప్రతిఫలం పొందే సమాజం ఏర్పడాలని ఆకాంక్షించారు.
రాజ్యాంగ పరిరక్షణే తమ లక్ష్యం
తనకు మతం కంటే ప్రతి భారతీయుడి గొంతుక ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులకు తాము మద్దతు ఇవ్వబోమని తెలిపారు.
ప్రేమ, అహింస మార్గంలోనే తమ పోరాటం కొనసాగుతుందని, అయితే రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను మాత్రం అంగీకరించబోమని హెచ్చరించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం వివరణ ఇదీ..
మరోవైపు ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం తన వైఖరిని వెల్లడించింది. అనర్హులు, మరణించిన వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, నకిలీ పేర్లను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వివరించింది. సవరణ ప్రక్రియలో గుర్తించిన 13.39 కోట్ల పేర్లన్నీ అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.
జాబితా నుంచి పేరు తొలగించబడినప్పటికీ అర్హత ఉన్నవారు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల పారదర్శకత అంశాలు మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
also read: హింసకు సినిమాలే కారణమా? రాప్తాడు ఘటనపై రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
