Homeతెలంగాణఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు మరో చిక్కు.. సిద్దిపేటలో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు మరో చిక్కు.. సిద్దిపేటలో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు

క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదుతో గతంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును భౌగోళిక పరిధి ఆధారంగా సిద్దిపేటకు బదిలీ చేశారు. దీంతో అక్కడి పోలీసులు 496/2026 క్రైమ్ నంబర్‌తో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి పలు అంశాలు ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. తనకు సంబంధించిన మూడు ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా తన భార్య ఫోన్‌పైనా నిఘా పెట్టి వ్యక్తిగత సంభాషణలు, ఇతర కీలక సమాచారాన్ని సేకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అనుచరుల ఫోన్లను కూడా పర్యవేక్షించినట్లు ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేశారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో వివరించినట్లు తెలుస్తోంది. రాజకీయ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు.

గతంలోనూ తనపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. హరీశ్ రావు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు కాలేదని, దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తొలుత హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో Cr.No.1205/2024తో నమోదైన కేసు తాజాగా సిద్దిపేటకు బదిలీ అయింది. ప్రస్తుతం 496/2026 క్రైమ్ నంబర్‌తో ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో తదుపరి విచారణను సిద్దిపేట పోలీసులు చేపట్టనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు