ప్రముఖ నటి సాయి పల్లవి ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో సీతాదేవి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో సీతగా కనిపించేందుకు ఆమె ప్రత్యేకంగా సిద్ధమైనట్లు వెల్లడించారు. తాజాగా అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి.. ఈ పాత్ర కోసం తాను అనుసరించిన పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సీతాదేవి వంటి గొప్ప పాత్రను తెరపై ఆవిష్కరించడం సాధారణ విషయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ బాధ్యతను ఎంతో గౌరవంగా తీసుకున్నానని, అందుకే పాత్రకు న్యాయం చేయాలని ప్రార్థనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. తాము రూపొందిస్తున్నది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునే చిత్రమని ఆమె పేర్కొన్నారు. అందుకే సీతాదేవి పాత్రను గౌరవప్రదంగా పోషించేందుకు మానసికంగా సిద్ధమయ్యానని వివరించారు.
షూటింగ్ సమయంలో ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాల్లో ధ్యానం తనకు ఎంతో సహాయపడిందని సాయి పల్లవి చెప్పారు. ఏదైనా క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు సీతాదేవి ఆ సమయంలో ఎలా స్పందించేవారో ఊహించుకునేదాన్నని తెలిపారు. ఆవేశానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆలోచించడం, పరిస్థితులను ఓపికగా అర్థం చేసుకోవడం వంటి లక్షణాలను ఈ పాత్ర ద్వారా నేర్చుకున్నానని వెల్లడించారు.
ఇక నితేశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెరపై భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
also read: ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనపై కేటీఆర్ సెటైర్లు.. రాహుల్, రేవంత్‌పై తీవ్ర విమర్శలు!
