క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేసు నిధుల దుర్వినియోగం కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె. తారకరామారావు (కేటీఆర్) తో పాటు ఇతర నిందితులకు నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, 2026 జూలై 31న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
సమన్లు అందుకున్న ముఖ్యులు…
A1 – కేటీఆర్: మాజీ మున్సిపల్ శాఖ మంత్రి.
A2 – అరవింద్ కుమార్: మున్సిపల్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐఏఎస్).
A3 – బి.ఎల్.ఎన్ రెడ్డి: హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్.
స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (కిరణ్ రావు), బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈవో ప్రతినిధి అల్బెర్టో లాంగో. గత భారాస ప్రభుత్వ హయాంలో (2023 ఫిబ్రవరి) హుస్సేన్‌సాగర్ వద్ద ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ కోసం బ్రిటన్‌కు చెందిన ఎఫ్ఈవో (FEO), గ్రీన్కో అనుబంధ సంస్థ ‘ఏస్ నెక్స్ట్‌జెన్’, మున్సిపల్ శాఖ (MA&UD) ల మధ్య ఒప్పందం కుదిరింది.
ఆ తర్వాత ఏస్ నెక్స్ట్‌జెన్ తప్పుకోవడంతో, కేటీఆర్ ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ (HMDA) సాధారణ నిధుల నుండి సుమారు రూ. 55 కోట్లు (90 లక్షల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు) లండన్‌లోని ఎఫ్ఈవో ఖాతాకు బదిలీ చేసినట్లు ఏసీబీ తేల్చింది. 2023 అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, ప్రభుత్వం మరియు ఆర్బీఐ అనుమతులు లేకుండానే ఈ నిధులు బదిలీ అయ్యాయి.
నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐటీ శాఖ హెచ్ఎండీఏకు రూ. 8.07 కోట్ల జరిమానా కూడా విధించింది. రేసు బాధ్యతలు అప్పగించినందుకు ప్రతిఫలంగా ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థ నుండి భారాస పార్టీకి రూ. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని, ఇది క్విడ్ ప్రో కో కిందకే వస్తుందని ఏసీబీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
తాజా పరిణామంకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదు మేరకు 2024 డిసెంబరులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గతేడాది నవంబరులో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారు. తాజాగా ఏసీబీ దాఖలు చేసిన వెయ్యికి పైగా డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితులకు అధికారికంగా సమన్లు జారీ చేసింది