ఉత్తరప్రదేశ్‌లో వైద్యశాస్త్రానికే సవాలుగా నిలిచిన అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సంభల్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల అమీనా అనే మహిళ కేవలం 5 రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో జరిగిన ఈ అరుదైన ప్రసవం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యంత ప్రమాదకరమైన మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కేసుల్లో సాధారణంగా శస్త్రచికిత్స ద్వారానే ప్రసవం నిర్వహించడం జరుగుతుంది. కానీ అమీనాకు నలుగురు శిశువులు కూడా సహజ ప్రసవం ద్వారానే జన్మించడం వైద్యరంగంలో అరుదైన సంఘటనగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం తల్లితో పాటు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గర్భధారణ ప్రారంభ దశలోనే అల్ట్రాసౌండ్ పరీక్షల్లో అమీనాకు ఒకేసారి నలుగురు పిండాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి సందర్భాల్లో తల్లి ప్రాణాలకు ప్రమాదం ఎక్కువగా ఉండటంతో సాధారణంగా పిండాల సంఖ్య తగ్గించే ప్రక్రియను వైద్యులు సూచిస్తుంటారు. అమీనాకు కూడా ఇద్దరు పిల్లలను మాత్రమే కొనసాగించేలా ఫీటల్ రిడక్షన్ చేయించుకోవాలని వైద్య బృందం సలహా ఇచ్చింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం నలుగురు పిల్లలను కూడా కాపాడాలని నిర్ణయించుకున్నారు. గర్భధారణ సమయంలో అమీనాకు రక్తపోటు తీవ్రంగా పెరగడం, కాలేయానికి సంబంధించిన సమస్యలు రావడం వల్ల పలుమార్లు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఆమె ఆరోగ్యాన్ని క్రమంగా నియంత్రణలోకి తీసుకొచ్చారు.
ఆసుపత్రి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మే 8న అమీనాకు మొదటిసారి ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. మే 9న ఆమె మొదటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆ శిశువు బరువు కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను సూచించింది. అప్పటికి ఆమెకు పూర్తి గర్భకాలం పూర్తి కాకపోవడంతో మిగిలిన ముగ్గురు పిల్లలను గర్భంలోనే సురక్షితంగా ఉంచేందుకు వైద్యులు అత్యంత జాగ్రత్తగా చికిత్స కొనసాగించారు. అనంతరం 5 రోజుల తర్వాత మే 14న అమీనాకు మళ్లీ నొప్పులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరో కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. నలుగురు శిశువులు వేర్వేరు గర్భసంచుల్లో ఉండటంతోనే ఇలాంటి అరుదైన పరిస్థితిలో సహజ ప్రసవం సాధ్యమైందని వైద్యులు వివరించారు.
ఈ అత్యంత క్లిష్టమైన కేసును విజయవంతంగా పూర్తి చేయడానికి వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక బృందంగా పనిచేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి తల్లి, శిశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ సమయానుకూలంగా వైద్య సేవలు అందించారు. ఆధునిక వైద్య సదుపాయాలు, వైద్యుల నైపుణ్యం, కుటుంబ సభ్యుల సహకారం వల్లే ఈ అసాధ్యంగా భావించిన ప్రసవం విజయవంతమైందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కిరాణా దుకాణం నిర్వహిస్తున్న పిల్లల తండ్రి మహమ్మద్ అలీమ్, కుటుంబ సభ్యురాలు ఇమ్రానా పర్వీన్ వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైద్య చరిత్రలో ఇది అరుదైన విజయంగా నిలిచిపోతుందని ఆసుపత్రి అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Vastu Tips: ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం, సంపద గల్లంతే..