ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘ఢిల్లీ చలో’ ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన భారీ సభను ఖర్గే చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. యువత, మహిళలు, మైనారిటీల ఓటు హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు కేంద్రంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరని ఖర్గే స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ, పోలీసుల చర్యలకు తాము వెనుకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల అక్రమాల ద్వారానే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ‘మోదీని తొలగించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ కార్యకర్తలు, కూటమి నేతలతో కలిసి నినాదాలు చేశారు.
ఓటర్ల జాబితాపై శశిథరూర్ ఆందోళన
ఇదే ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఎన్నికల ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ కార్యక్రమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితమైనది కాదని అన్నారు. ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటమే ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పేరుతో సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం ఆమోదయోగ్యం కాదని శశిథరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితా తయారీ, సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఆ హక్కుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు.
also read: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. నెక్స్ట్ మోదీ, అమిత్ షానే అంటూ వ్యాఖ్యలు!
