భక్తిరస నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ‘హనుమాన్ అంశ్’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి తానే పూర్తిస్థాయిలో డబ్బులు సమకూర్చినట్లు జరుగుతున్న ప్రచారంపై 21 ఏళ్ల యువ సహ నిర్మాత అనుప్రియ నాగర్ స్పందించారు. సినిమా మొత్తం బడ్జెట్‌ను తాను భరించలేదని, తన పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో మూడో వంతు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదివిన అనుప్రియ.. సినిమా నిర్మాణ ప్రక్రియ మధ్యలో ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. షూటింగ్ పూర్తైన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు నిధులు అవసరమైన సమయంలో చిత్ర బృందంతో ఆమె కలిసి పనిచేశారు. యూకేలో చదువుకునే సమయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ కూడబెట్టుకున్న పొదుపు మొత్తంలో కొంత భాగాన్ని ఈ సినిమాపై పెట్టుబడిగా పెట్టినట్లు ఆమె తెలిపారు.
తన పెట్టుబడిపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ అనుప్రియ మాట్లాడుతూ.. సినిమాలో మూడు తరాలకు చెందిన ముగ్గురు మహిళలు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. వారిలో తానే చిన్న వయస్కురాలినని, మొత్తం పెట్టుబడిలో తన వాటా మూడో వంతు మాత్రమేనని వివరించారు.
అయితే ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి కారణం కేవలం ఆర్థిక ప్రయోజనం కాదని అనుప్రియ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం నుంచి స్ఫూర్తి పొందిన కథతో దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని రూపొందించారు. నీమ్ కరోలీ బాబాపై తనకు ఎంతో భక్తి ఉందని, ఆయన జీవిత కథను మరింత మంది భారతీయులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగిందని ఆమె తెలిపారు.
యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సహా పలువురు ప్రముఖులపై నీమ్ కరోలీ బాబా ప్రభావం ఉందని అనుప్రియ గుర్తుచేశారు. ఈ ఆధ్యాత్మిక నేపథ్యమే తనను సినిమా నిర్మాణంలో భాగమయ్యేలా చేసిందని చెప్పారు.
ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. అందుబాటులో ఉన్న పలు నివేదికల ప్రకారం ‘హనుమాన్ అంశ్’ను సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
తాను పెట్టిన పెట్టుబడి ఇప్పటికే తిరిగి వచ్చిందని అనుప్రియ తెలిపారు. ఇంత చిన్న బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇంతటి స్థాయిలో విజయాన్ని అందుకోవడం అద్భుతమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
also read: పీర్జాపూర్‌లో వినాయకుడి నిమజ్జనం.. పూజలు కూడా చేయకుండానే గణనాథుడికి వీడ్కోలు
