Homeతెలంగాణపీర్జాపూర్‌లో వినాయకుడి నిమజ్జనం.. పూజలు కూడా చేయకుండానే గణనాథుడికి వీడ్కోలు

పీర్జాపూర్‌లో వినాయకుడి నిమజ్జనం.. పూజలు కూడా చేయకుండానే గణనాథుడికి వీడ్కోలు

వినాయక చవితి వేడుకల వేళ రంగారెడ్డి జిల్లాలోని పీర్జాపూర్‌లో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. వర్గ విభేదాల కారణంగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేని పరిస్థితి ఏర్పడటంతో.. చివరకు పూజలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకుండానే విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని జిల్లేడు చౌదరిగూడ మండలం పీర్జాపూర్‌లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కొందరు స్థానికులు ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి పూజలు నిర్వహించాలని భావించారు. అయితే, విగ్రహ ప్రతిష్ఠ విషయంలో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది.

ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడినే ప్రతిష్ఠించాలని ఇరు వర్గాలు పట్టుబట్టడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టిన పోలీసులు.. ఆలయంలో ఏ వర్గం కూడా గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని సూచించారు. ఇరు వర్గాలు వేర్వేరు ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపారు.

పోలీసుల సూచనతో ఓ వర్గం అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక తాము ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాన్ని గ్రామ చెరువుకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. సాధారణంగా వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ పీర్జాపూర్‌లో అందుకు భిన్నంగా పూజలు నిర్వహించకుండానే విగ్రహానికి నిమజ్జనం చేయడం స్థానికంగా చర్చకు దారితీసింది.

ఈ ఘటనపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని భావించామని, అయితే వర్గ విభేదాల కారణంగా ఉత్సవాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి విషయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం తమను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని కొందరు గ్రామస్థులు పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామ పెద్దలు, స్థానికులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

also read: పెద్దపల్లి జిల్లాలో విషాదం.. ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు