బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, నటి రాఖీ సావంత్ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. రాఖీ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. విజయవంతమైన మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం వెనుక అసూయ, వైఫల్య భావనే ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
రాఖీ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఇతరులను కించపరచడం ద్వారా కొందరు తమ సొంత వైఫల్యాలను సమర్థించుకోవాలని చూస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అయితే రాఖీని ఉద్దేశించి కంగనా చేసిన మరికొన్ని వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఎన్నో ప్రయత్నాలు, పరిచయాలు ఉన్నప్పటికీ రాఖీకి కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ కంగనా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ పని చేయడానికి కూడా సామర్థ్యం, ప్రతిభ అవసరమని అన్నారు. తాను మాత్రం తన ప్రయాణంలో ముందుకు సాగుతూనే ఉంటానని, తన రీల్స్ చూస్తూ రాఖీ బాధపడుతూ ఉండొచ్చంటూ సెటైర్ వేశారు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా నిలిచాయి. కంగనా రనౌత్‌తో పాటు బీజేపీ నేత స్మృతి ఇరానీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ రాఖీ వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించారు.
అయితే కంగనా, రాఖీ మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. గతంలోనూ పలు అంశాల్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా జెన్ జెడ్‌పై కంగనా చేసిన వ్యాఖ్యల సమయంలో రాఖీ ఘాటుగా స్పందించారు. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో మరోసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి వచ్చింది.
also read: ‘మోదీ కథ’.. ప్రధాని మోదీ మానవీయ కోణాన్ని ఆవిష్కరించే పుస్తకం
