తెలుగు మూలాలున్న జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. పట్నాలోని లోక్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో బిహార్ గవర్నర్ సయ్యద్ హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొన్నమండ గ్రామానికి చెందినవారు. 1965 ఆగస్టు 7న అమలాపురంలో జన్మించిన ఆయన.. తండ్రి వాసుదేవమూర్తి ఉద్యోగరీత్యా ఢిల్లీలో స్థిరపడటంతో అక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం 1991లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.
తన న్యాయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన కామేశ్వరరావును 2010లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా గుర్తించింది. 2013 ఏప్రిల్ 17న అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015 మార్చిలో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
తర్వాత కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన ఆయన.. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుకు తిరిగి వచ్చి న్యాయ సేవలను కొనసాగించారు. తాజాగా పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై అత్యున్నత బాధ్యతలు చేపట్టారు.
కోనసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదగడంపై స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. జస్టిస్ కామేశ్వరరావు న్యాయ ప్రస్థానం తమ ప్రాంతానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
also read: అల్లూరి జిల్లాలో విషాద ఘటన.. ఏకే-47తో ఏఆర్ ఎస్సై ఆత్మహత్యాయత్నం
