ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన ఓ జువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై స్పందించిన ఐశ్వర్య లక్ష్మి.. ఆ రోజు కార్యక్రమంలో ఎదురైన పరిస్థితులను వివరించారు.
ఈవెంట్లో కొందరు ఫొటోగ్రాఫర్లు తనను ఫొటోలు తీసిన విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖం సరిగ్గా కనిపించేలా కాకుండా, కావాలనే అసౌకర్యంగా అనిపించే కోణాల్లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఇబ్బందిగా ఫీలయ్యానని, దాంతో తన బాడీ లాంగ్వేజ్‌లో మార్పు కనిపించిందని చెప్పారు. అంతేకానీ తాను ధరించిన దుస్తుల్లో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.
‘అసౌకర్యంగా అనిపిస్తే అలాంటి దుస్తులు ఎందుకు ధరించారు?’ అని మహిళలను ప్రశ్నించే విధానాన్ని ఐశ్వర్య లక్ష్మి తప్పుబట్టారు. ఒక మహిళ ఏ దుస్తులు ధరించాలనే విషయంలో ఇతరులు తీర్పులు చెప్పడం సరికాదని పేర్కొన్నారు.
సమాజంలో సంస్కృతి, విలువలు అనేవి కేవలం మహిళలు ధరించే దుస్తులతోనే ముడిపడి ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. మన ప్రవర్తన, ఆలోచనా విధానంలో సంస్కృతి కనిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి, వృద్ధుల సంక్షేమం వంటి ముఖ్యమైన సామాజిక అంశాలపై చర్చించాల్సిన సమాజం.. మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడానికి మాత్రం ముందుంటోందని విమర్శించారు.
మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఐశ్వర్య లక్ష్మి సూచించారు. మహిళలు ధరించే దుస్తుల ఆధారంగా వారిని అంచనా వేయడం, ట్రోల్ చేయడం మానుకోవాలని ఆమె కోరారు.
also read: ‘హనుమాన్ అంశ్’పై యువ సహ నిర్మాత క్లారిటీ.. నా పెట్టుబడి అంతే!
