Homeక్రైమ్Luxury Hotel Scam: టూర్ గైడ్ అంటూ ఎంట్రీ.. బిల్లు కట్టకుండానే ఎగ్జిట్.. ఏకంగా 300...

Luxury Hotel Scam: టూర్ గైడ్ అంటూ ఎంట్రీ.. బిల్లు కట్టకుండానే ఎగ్జిట్.. ఏకంగా 300 హోటళ్లను బురిడీ కొట్టించిన ముసలోడు!

దేశవ్యాప్తంగా లగ్జరీ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని దాదాపు 36 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన బింగ్‌ సన్ జాన్‌ (69) అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. విదేశీ టూర్ గైడ్‌, ఇంగ్లిష్ టీచర్‌, యోగా శిక్షకుడిని అంటూ ఖరీదైన స్టార్ హోటళ్లలో బస చేసేవాడు. కొన్ని రోజుల పాటు విలాసవంతంగా గడిపిన తర్వాత బిల్లులు చెల్లించకుండా అక్కడి నుంచి పరారయ్యేవాడు.

పోలీసుల విచారణలో జాన్ గత 36 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా లగ్జరీ హోటళ్లను ఇదే తరహాలో మోసం చేసినట్లు వెల్లడైంది. హోటళ్లలో ఉండే సమయంలో అవకాశం దొరికితే విలువైన వస్తువులను కూడా తనతో తీసుకెళ్లేవాడని అధికారులు తెలిపారు. అతనిపై దేశంలోని పది కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఢిల్లీలోని తిహార్ జైలు సహా పలు జైళ్లలో కలిపి 15 సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించినట్లు సమాచారం.

తాజాగా జూన్ 25న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో జాన్ బస చేశాడు. జూన్ 27న ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హోటల్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో హోటల్‌కు రూ.63,755 బిల్లు బకాయిగా మిగిలింది. అంతేకాదు, అత్యవసరం ఉందని చెప్పి హోటల్ యాజమాన్యం నుంచి తీసుకున్న రూ.1.48 లక్షల విలువైన ల్యాప్‌ టాప్‌ ను కూడా తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన రాయ్‌పుర్ పోలీసులు, చెక్ ఇన్ సమయంలో సమర్పించిన గుర్తింపు పత్రాలు, మొబైల్ నంబర్లను సాంకేతికంగా విశ్లేషించారు. దర్యాప్తులో అతడి ఆచూకీ ఒడిశాలోని భువనేశ్వర్‌ లో లభించడంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. విచారణలో జాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ నేరగాడు, సీరియల్ కిల్లర్‌గా పేరుగాంచిన ఛార్లెస్ శోభరాజ్ తనకు ఎంతో ఇష్టమని, అతని పద్ధతులనే అనుసరిస్తూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నానని పోలీసులకు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు