Homeక్రైమ్Sai Krishna Custodial Death: స్టేషన్ టెర్రస్‌ పై ఎముకలు, బూడిద.. సాయికృష్ణ కేసులో...

Sai Krishna Custodial Death: స్టేషన్ టెర్రస్‌ పై ఎముకలు, బూడిద.. సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్!

ఏపీలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మృతి కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ టెర్రస్‌ పై అనుమానాస్పద మరకలతో ఉన్న ఒక లాఠీ, కొన్ని ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్‌ లెట్‌ తో పాటు మరికొన్ని వస్తువులను సిట్ అధికారులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని న్యాయాధికారి సమక్షంలో సీల్ వేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మృతి చెందిన సాయికృష్ణకు చెందినవే అయి ఉండొచ్చని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ వస్తువులు స్టేషన్ టెర్రస్‌ పైకి ఎలా వచ్చాయన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఫోరెన్సిక్, క్లూస్ బృందాలు స్టేషన్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి, లాకప్ గదులు, గోడలపై ఉన్న మరకల నమూనాలను కూడా సేకరించాయి. శవాన్ని దహనం చేసిన తర్వాత ఎముకలు, బూడిదను మళ్లీ స్టేషన్‌ కు ఎందుకు తీసుకొచ్చారు? టెర్రస్‌పైనే ఎందుకు ఉంచారు? లాఠీపై ఉన్న మరకలు ఏవన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సాయికృష్ణ కస్టడీలో తగిలిన గాయాల కారణంగానే మరణించాడని సిట్ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ఇప్పుడు బయటపడిన ఈ ఆధారాలు కేసులో కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

టెర్రస్‌ పై దొరికిన ఎముకలు, బూడిద నిజంగా సాయికృష్ణవేనా అనే విషయాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ధారించనున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతితో ఆయన తల్లి విజయలక్ష్మి నుంచి డీఎన్‌ఏ నమూనా సేకరించి పోల్చి చూడనున్నారు. ఈ పరీక్షల ఫలితాలు కేసులో కీలక నిజాలను బయటపెట్టే అవకాశముంది.

మరోవైపు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజును విచారించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, విచారణ ప్రారంభం కాలేదు. విచారణను విజయవాడలో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో తాను నిర్దోషినని, తనను కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని నాగరాజు కోర్టుకు తెలిపారు. అవసరమైతే తమ న్యాయవాదుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని, ఎలాంటి వేధింపులకు గురిచేయొద్దని ఆయన కోరారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు