క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వరుసగా విధిస్తున్న మరణశిక్షలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కేవలం నాలుగు నెలల వ్యవధిలో 10 వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలిన 22 మందికి మరణశిక్ష విధించారు. ఇటీవల 12 ఏళ్ల బాలుడి హత్య కేసులో నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి మరణశిక్ష విధిస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఈ కేసుతో పాటు అత్యంత క్రూరమైన, తీవ్రమైన నేరాలకు సంబంధించిన పలు కేసుల్లోనూ దోషులకు కఠిన శిక్షలు ఖరారు చేశారు.
వ్యాపారి కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు, రైతు హత్య, హోంగార్డు హత్య, పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసిన ఘటనలు వంటి కేసుల్లో నిందితులపై విచారణ జరిపిన అనంతరం మరణశిక్ష విధించారు. నేరాల తీవ్రత, హత్యల తీరును పరిగణనలోకి తీసుకుని కఠినమైన శిక్షలు అవసరమని ఆయా తీర్పుల్లో కోర్టు పేర్కొన్నట్లు సమాచారం. ఈ తాజా తీర్పులతో రవికుమార్ దివాకర్ తన మొత్తం న్యాయ సేవా కాలంలో ఇప్పటివరకు 35 మందికి మరణశిక్ష విధించిన న్యాయమూర్తిగా నిలిచారు. దీంతో ఆయన తీర్పులపై న్యాయవర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
రవికుమార్ దివాకర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రాఫిక్ సర్వే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తిగా ఆయన అప్పట్లో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయితే మరణశిక్ష అనేది అత్యంత తీవ్రమైన శిక్ష కావడంతో, ఇలాంటి తీర్పులపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్ష తుది అమలుకు ముందుగా ఉన్నత న్యాయస్థానాల న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటుంది.
also read : ఉరికి ప్రత్యామ్నాయం కోరిన పిల్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
