Homeక్రైమ్కల్తీ.. ఆపై కుళ్లిన ఆహారం...!

కల్తీ.. ఆపై కుళ్లిన ఆహారం…!

  • టీజీ సేఫ్ బృందాల తనిఖీల్లో దిగ్భ్రాంతికర దృశ్యాలు

  • ప్రమాదంలో ప్రజారోగ్యం

  • హోటల్ లైసెన్సింగ్ విధానంలో మార్పు తెస్తేనే ప్రయోజనం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా టీజీ సేఫ్ బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపడుతున్నాయి. ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. అయితే ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికర దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి.

తనిఖీ చేసిన వ్యాపార సముదాయాల్లో దాదాపు 90 శాతం చోట్ల పరిశుభ్రత లోపాలు, కుళ్ళిన పదార్థాలు, నిషేధిత రసాయనాలు వాడటం వంటి తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రజారోగ్యంతో వ్యాపారులు చేస్తున్న ఈ చెలగాటాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అంతటితో ఆగకుండా ఆ వ్యవస్థను బాగు చేసేలా కఠిన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

  • సాధారణ ప్రక్రియగా..

తెలంగాణ వ్యాప్తంగా ఆహార కల్తీ అనేది ఒక సర్వసాధారణంగా మారిపోయింది. ప్రజలు డబ్బులు చెల్లించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతోంది. కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే కనిపిస్తోంది. కనీస బాధ్యత కూడా కనిపించడం లేదు. కేవలం దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించగానే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది.

హోటల్ ప్రారంభించడానికి ముందే కిచెన్ నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, నిల్వ సౌకర్యాలు, వ్యర్ధాల నిర్వహణ ప్రామాణికంగా ఉన్నాయో లేదో స్వయంగా పరిశీలించిన తర్వాతే లైసెన్స్ మంజూరు చేయాలి.

దీనికి తోడు ప్రతి హోటల్ కు ఉపాధి, వ్యాపార స్థాయిని బట్టి హైజిన్ రేటింగ్ ఇచ్చి.. ఆ గ్రేడ్ బోర్డును హోటల్ ప్రవేశద్వారం వద్ద కస్టమర్లకు కనిపించేలా ప్రదర్శించడం తప్పనిసరి చేయాలి.

ప్రజలు తాము తినే ఆహారం ఏ స్థాయి ప్రమాణాలతో ఉందో తెలుసుకునే హక్కును కల్పించినప్పుడే హోటళ్ల యాజమాన్యాల్లో ఒక రకమైన మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

  • నిరంతర తనిఖీలు ఉంటేనే..

ఆహార కల్తీ నియంత్రణకు సంబంధించి తనిఖీలను నిరంతరం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఏడాదికి ఒక్కసారి లేదా కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే ఆకస్మిక తనిఖీల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. తెలంగాణ వ్యాప్తంగా వేలాదిగా ఉన్న హోటల్ లను నిరంతరం పర్యవేక్షించడం ప్రభుత్వ అధికారుల కే సాధ్యపడదు.

దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆమోదించిన థర్డ్ పార్టీ ప్రైవేట్ ఆడిటింగ్ ఏజెన్సీలను సైతం రంగంలోకి దించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి హోటల్ తమ ప్రాంగణంలో ఆడిట్ నిర్వహించి… ఆ నివేదికను టీజీఎఫ్ పోర్టల్ లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేయాలి.. సరుకుల లభ్యత, నిల్వ గడువు, నీటి నాణ్యతా ప్రమాణాలు క్లౌడ్ ద్వారా ఆన్లైన్ లో ట్రాక్ చేసే వ్యవస్థను అందుబాటులోకి తెస్తే పారదర్శకత పెరుగుతుంది.

  • అవగాహన పెంచితేనే..

మరోవైపు వంట పనివారు, వంట గదిలో పని చేసే కార్మికులకు ఆహార భద్రతపై సరైన పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం కూడా ఆహార కల్తీ కి కారణం అవుతోంది. అసలు ఏ పదార్థాలు ఏ పరిమాణంలో వాడాలి. ఉండిన ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు.

ప్రభుత్వం హోటల్ యాజమాన్యాల సంఘాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉంది. వంట పని వారితో పాటు కార్మికులకు విధిగా సర్టిఫికేషన్ కోర్సుల నిబంధనను పెట్టాలి.

సిబ్బందికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేస్తూనే.. వారికి వ్యక్తిగత పరిశుభ్రతపై శిక్షణనివ్వడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారాలి. హోటల్ పరిశ్రమను ఒక శత్రువుగా కాకుండా.. ప్రజారోగ్యంలో భాగస్వామిగా చూడాలి. వాటిపై కఠిన నిబంధనలు తీసుకోవడం ద్వారా మూసి వేయించడం అనేది చేయకూడదు. వారికి నోటీసులు ఇచ్చి క్రమేపి వారిలో మార్పు తీసుకురావాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు