Homeఅంతర్జాతీయంఅమెరికాలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి.. కిటికీలు ధ్వంసం

అమెరికాలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి.. కిటికీలు ధ్వంసం

అమెరికాలోని ఓ హిందూ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఒహాయో రాష్ట్రంలోని గ్రేటర్‌ క్లీవ్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామినారాయణ్‌ హిందూ టెంపుల్‌ వడ్తాళ్‌ధామ్‌ను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం మధ్యాహ్నం దాడి జరిగినట్లు సమాచారం. ఆలయంపై ఇటుకలు విసరడంతో భవనానికి నష్టం వాటిల్లింది. పలు కిటికీలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజారులతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఈ దాడిపై ఉత్తర అమెరికా హిందువుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయం ఉన్న రిచ్‌మండ్‌ హైట్స్‌ ప్రాంత మేయర్‌ కిమ్‌ థామస్‌, నగర అధికారులు ఘటనను ఖండించాలని కోరింది. ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి, అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ (HAF) కూడా ఈ ఘటనను ఖండించింది. అమెరికాలో హిందూ అమెరికన్‌ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్న సమయంలో ఆలయంపై దాడి జరగడం ఆందోళన కలిగించే పరిణామమని సంస్థ పేర్కొంది. నిందితుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని HAF ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుహాగ్‌ శుక్లా కోరారు.

మరోవైపు, మరో పది రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. హిందూ హెరిటేజ్‌ మంత్‌ వేడుకలకు భారతీయ-అమెరికన్‌ సమాజం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2022లో న్యూయార్క్‌లోని శ్రీ తులసీ మందిర్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన నమోదైంది. 2023లో కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో స్వామినారాయణ్‌ ఆలయంపై అభ్యంతరకర గ్రాఫిటీ వేసినట్లు సమాచారం. 2024లో న్యూయార్క్‌, కాలిఫోర్నియాలోని బీఏపీఎస్‌ హిందూ ఆలయాలపైనా దాడులు జరిగినట్లు హిందూ సంస్థలు వెల్లడించాయి.

తాజా ఘటన నేపథ్యంలో అమెరికాలోని హిందూ ప్రార్థనా స్థలాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. దాడికి కారణాలు, నిందితుడి వివరాలు వంటి అంశాలపై పోలీసుల దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: మావోయిస్టుల నుంచి బాలీవుడ్‌ వరకు.. తొమ్మిది మంది మహిళలకు అరుదైన అవకాశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు