Homeసినిమామావోయిస్టుల నుంచి బాలీవుడ్‌ వరకు.. తొమ్మిది మంది మహిళలకు అరుదైన అవకాశం

మావోయిస్టుల నుంచి బాలీవుడ్‌ వరకు.. తొమ్మిది మంది మహిళలకు అరుదైన అవకాశం

ఛత్తీస్‌గఢ్‌లో ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన తొమ్మిది మంది మహిళల జీవితాల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలుకానుంది. హింసను వీడి సాధారణ జీవనంలోకి తిరిగి వచ్చిన ఈ మహిళలకు బాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన ఫ్యాషన్‌ షోలో వారు చేసిన ర్యాంప్‌ వాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

సుక్మా జిల్లాకు చెందిన ఈ తొమ్మిది మంది మహిళలు ఆగస్టులో రాయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర గ్రామోద్యోగ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్‌ షోలో సంప్రదాయ దుస్తులు ధరించి వారు ర్యాంప్‌పై సందడి చేశారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో వారు ర్యాంప్‌ వాక్‌ చేయడం పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో సినీ పరిశ్రమలోనూ ఆసక్తి ఏర్పడింది.

ఈ వీడియోను ‘బెంగాల్‌ 1947’ చిత్ర దర్శకుడు ఆకాశ్‌ ఆదిత్య లామా గమనించినట్లు సమాచారం. ఆయన తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో ఈ తొమ్మిది మంది మహిళలకు అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

1994లో బస్తర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సున్నితమైన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవించిన అనుభవం ఉన్న ఈ మహిళలు సినిమాలోని పాత్రలకు మరింత సహజత్వాన్ని తీసుకురాగలరని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్‌ను నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో బస్తర్‌ అడవుల్లో నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఎంపికైన మహిళలకు ముందుగా ఆడిషన్లు నిర్వహించనున్నారు. అనంతరం దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ప్రత్యేక నటన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.

ఈ పరిణామంపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయి కూడా స్పందించారు. హింసను వదిలి సమాజంలోని సాధారణ జీవనంలోకి వచ్చిన వారికి ఇలాంటి అవకాశాలు లభించడం పునరావాస ప్రక్రియకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు ఇటువంటి అవకాశాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు.

ఒకప్పుడు తుపాకులు పట్టిన చేతులు.. ఇప్పుడు కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతున్నాయి. ర్యాంప్‌ వాక్‌తో మొదలైన ఈ కొత్త ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్‌ సినిమా వరకు చేరడం ఈ తొమ్మిది మంది మహిళల జీవితాల్లో ఒక కీలకమైన మలుపుగా మారింది.

also read: ప్రేమ పేరుతో ఘాతుకం.. కత్తి దాడిలో 19 ఏళ్ల యువతి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు