Homeతెలంగాణఆమంచి కృష్ణమోహన్ ఎటువైపు...?!

ఆమంచి కృష్ణమోహన్ ఎటువైపు…?!

  • కాంగ్రెస్ లో ఉన్నా.. పార్టీకి దూరంగా

  • సొంత అజెండాతో ముందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యే

  • వైసీపీ లేదా జనసేనలోకి వెళ్లే అవకాశం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ ది ప్రత్యేక స్థానం. చాలా దూకుడు స్వభావం కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం భిన్నంగా సాగుతూ వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నారు.

అందుకే నిత్యం ప్రజా పోరాటాలు చేస్తున్నారు. తాజాగా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల వరకు ప్రజల్లో ఉండి.. తర్వాత ఏదో ఒక ప్రధాన రాజకీయ పార్టీలో చేరాలన్న భావనతో ఉన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ ఇప్పుడు న్యాయ పోరాటాలు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఏదో ఒక పార్టీలో చేరుతారన్న ప్రచారం పతాక స్థాయిలో జరుగుతోంది.

  • కాంగ్రెస్ లో చేరిక…

మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమంచి కృష్ణమోహన్. చీరాల వైసీపీ టికెట్ ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 20 వేలకు పైగా ఓట్లను సొంతం చేసుకుని మూడో స్థానంలో నిలిచారు. ఆమంచి కృష్ణమోహన్ చీల్చిన ఓట్లతో టిడిపి అభ్యర్థి ఘనవిజయం సాధించారు. భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ఫలితాల అనంతరం కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పోరాటాలు చేయడం లేదు. వ్యక్తిగత పోరాటాలతో ముందుకు సాగుతున్నారు.

  • పట్టున్న నియోజకవర్గం..

చీరాల నియోజకవర్గ ఆమంచి కృష్ణమోహన్ కు పట్టున్న ప్రాంతం. గతంలో ఇక్కడ ఆయన సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుని గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన జడ్పిటిసిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో రోశయ్య చీరాల నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు.

అయితే తర్వాత రోశయ్య ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడంతో.. చీరాలలో పోటీ చేసే అవకాశం దక్కింది ఆ మంచి కృష్ణమోహన్ కు. 2009లో తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో టికెట్ దక్కలేదు. అందుకే నవోదయం పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో విజయం దక్కింది కృష్ణమోహన్ కు. టిడిపి అధికారంలోకి రావడంతో తన నవోదయం పార్టీని అందులో విలీనం చేశారు. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే టిడిపి అభ్యర్థిగా గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం వైసీపీలోకి ఫిరాయించారు. అప్పటినుంచి వారి మధ్య విభేదాలు ఉండగా 2024 ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు జగన్ టికెట్ ఇవ్వడంతో బయటకు వెళ్లిపోయారు ఆమంచి.

  • వైసీపీలోకి ఛాన్స్..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ అడుగులు వైసీపీ వైపు వేసే అవకాశం ఉంది. ఒకవేళ కరణం బలరాం కుటుంబం టిడిపిలో చేరితే.. మళ్లీ జగన్ చేరదీసి.. చీరాల బాధ్యతలు కట్టబెట్టి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే ఆ నియోజకవర్గంలో బలిజ, కాపు సామాజిక వర్గం అధికం. ఆ లెక్కన ఆమంచి కృష్ణమోహన్ అటువైపు అడుగులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు