Homeతెలంగాణ12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్!!

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 12వ ప్రపంచ యోగా దినోత్సవం కౌంట్ డౌన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతమని అన్నారు. రేపు(ఆదివారం) 200 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొంటాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతాలో జరిగే యోగా వేడుకల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు.

 

గత 12 ఏళ్లుగా కోల్‌కతాలో యోగా దినోత్సవ వేడుకలు జరగలేదన్నారు. యోగా డే సెలబ్రేషన్స్ కోసం నెల రోజులుగా అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. గత ఏడు సంవత్సరాలుగా యోగా వేడుకలకు 24 గంటల ముందు కౌంట్ డౌన్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రేపు యోగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. యోగా ఒక మతానికి పరిమితం కాదన్నారు. యోగా చేస్తే సమగ్ర మనిషిగా మారుతారని తెలిపారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అని చెప్పుకొచ్చారు. సర్వమానవ, సౌభ్రాతృత్వం, సర్వతోముఖాభివృద్ధికి యోగా అవసరమన్నారు. మానవ చైతన్యానికి నిదర్శనం యోగా అని పేర్కొన్నారు.

 

పూర్వీకులు రంగరించి మనకు అందించిన జీవన విధానం యోగా అని.. ఆరోగ్య, ఆధ్యాత్మిక, మానసిక ఒత్తిడి, స్థైర్యాన్ని ఇచ్చేది యోగా అని అన్నారు. యోగా అనేది మనిషికి, ప్రకృతిమాత అందించిన గొప్ప వరమన్నారు. ప్రకృతి ఒడిలో ప్రజలు జీవించాలని.. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాటను నిజం చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచానికి జీవన విధానాన్ని అందించిన దేశం భారత్ అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ప్రపంచానికి యోగాను అందించిన దేశం భారత్ అని ఎంపీ లక్ష్మణ్, నరేంద్రమోదీ 12 సంవత్సరాల క్రితం యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ప్రపంచ దేశాల్లో యోగాను చేస్తున్నారని.. యోగా వలన డిప్రెషన్ నుంచి బయటకు వస్తారని అన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ యోగా చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు