దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పే మాట ఒకటే… బాగా చదువుకుని డిగ్రీ తీసుకుంటే జీవితంలో సెట్ అవుతావు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఈ భావనను ప్రశ్నిస్తున్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ సౌరభ్ ముఖర్జియా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన భారత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా ఎత్తిచూపారు. ప్రస్తుతం కాలేజీల్లో విద్యార్థులకు నిజంగా అవసరమైన నైపుణ్యాల కంటే, పాఠాలను బట్టీ పట్టించడం మీదే ఎక్కువ దృష్టి ఉందన్నారు. ఆలోచించే విధానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెంపొందించడంలో వ్యవస్థ విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కాలేజీ నుంచి బయటకు వచ్చే ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం కొద్ది మందికే అదే ఏడాది ఉద్యోగం దొరుకుతోందని వెల్లడించారు. గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం కూడా గణనీయంగా పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
డిగ్రీ ఉన్నంత మాత్రాన మంచి ఉద్యోగం వస్తుందన్న నమ్మకం క్రమంగా తగ్గిపోతోందని ఆయన అన్నారు. మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కాలేజీల్లో బోధించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని విశ్లేషించారు. కొంతమంది సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారు, ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేసేవారు, అనేక గ్రాడ్యుయేట్ల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని ఉదాహరణ ఇచ్చారు.
ఇప్పటి ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధ, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్నాలజీ వంటి రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా విద్యా విధానం కూడా మారాల్సిన అవసరం ఉందని సౌరభ్ సూచించారు. పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ స్కిల్స్, సమస్య పరిష్కరణ సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. నిజంగా డిగ్రీల విలువ తగ్గుతోందా? లేక విద్యా వ్యవస్థ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు సరిపడా మారలేకపోతోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి ముందున్నాయి.
also read: ఊబకాయం అలర్ట్: బరువు పెరిగితే 19 రకాల క్యాన్సర్ల ముప్పు!