ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవనశైలిలో వచ్చిన మార్పులు ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు అధిక బరువు అంటే గుండెజబ్బులు, షుగర్ వంటి సమస్యలకే పరిమితం అనుకునేవారు. కానీ తాజా అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, ఊబకాయం ఇప్పుడు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా గణనీయంగా పెంచుతున్న కీలక కారణంగా గుర్తించబడింది. దాదాపు 15 లక్షల క్యాన్సర్ కేసులను విశ్లేషిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన 200కి పైగా పరిశోధనల సమీక్షలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) పెరుగుతున్న కొద్దీ కొన్ని ప్రత్యేక క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
ప్రత్యేకంగా గర్భాశయం లోపలి పొరలో వచ్చే ఎండోమెట్రియల్ క్యాన్సర్, అలాగే ఆహార నాళంలో ఏర్పడే ఈసోఫేజియల్ అడెనోకార్సినోమా వంటి క్యాన్సర్లతో అధిక బరువు బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది. BMIలో ప్రతి 5 యూనిట్ల పెరుగుదలతో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదం దాదాపు 58 శాతం, ఈసోఫేజియల్ క్యాన్సర్ ప్రమాదం సుమారు 47 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. ఇంతకుముందు పెద్దగా చర్చలో లేని లుకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా, మూత్రాశయ క్యాన్సర్, మెదడులో వచ్చే గ్లియోమా ట్యూమర్ల విషయంలో కూడా అధిక BMI ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.
అధిక బరువు క్యాన్సర్‌కు ఎలా దారితీస్తుంది అన్నదానిపై నిపుణులు కొన్ని ముఖ్య కారణాలను సూచిస్తున్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువైతే దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరిగి కణాల అసాధారణ వృద్ధికి దారి తీస్తాయి. ఇవే క్రమంగా క్యాన్సర్‌కు కారణమయ్యే పరిస్థితులను సృష్టిస్తాయి.
అయితే అన్ని క్యాన్సర్ల విషయంలో ఇదే ఫలితం కనిపించలేదు. ముఖ్యంగా మెనోపాజ్‌కు ముందు వచ్చే కొన్ని రొమ్ము క్యాన్సర్లలో అధిక BMI ఉన్న మహిళల్లో ప్రమాదం కొంత తక్కువగా కనిపించినా, దీనిని బరువు పెరగడం మంచిదని భావించడం తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సమతుల జీవనశైలి ద్వారా బరువును నియంత్రించుకోవడం అత్యంత అవసరం.
also read: రూ. 20కే లగ్జరీ ట్రావెల్?” – ముంబై మెట్రో చూసి అమెరికన్ మహిళ షాక్!