క్రైమ్ మిర్రర్, సినిమా:- దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న యువ హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. సప్త సాగరాలు దాటి సినిమాతో తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈ కన్నడ భామ, ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు మంచి గుర్తింపు లభించడంతో పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కుతున్నాయి.
ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యశ్ నటిస్తున్న టాక్సిక్, ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ వంటి భారీ చిత్రాల్లో ఆమె పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.
నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. దండోరా సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, కథానాయిక పాత్ర కోసం రుక్మిణిని సంప్రదించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ వార్తకు మరింత ఆసక్తి పెరగడానికి మరో కారణం కూడా ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్ తనకు తెలుగులో అత్యంత ఇష్టమైన హీరో నాని అని వెల్లడించింది. నాని సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం ఉంటుందని, ఆయన కథల ఎంపిక తనను ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పింది. అవకాశం వస్తే నానితో కలిసి పనిచేయాలని కూడా అప్పట్లో తన కోరికను వెల్లడించింది.
ఇప్పుడు నాని నిర్మాణ సంస్థలో తెరకెక్కబోయే చిత్రంలో అవకాశం రావడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రుక్మిణి కల నెరవేరినట్టే అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కథకు సరిపోయే నటుడి ఎంపికపై మేకర్స్ దృష్టి పెట్టినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే హిట్, హిట్ 2, మీట్ క్యూట్, కోర్ట్ వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన నాని, కొత్త కథలను ప్రోత్సహించే నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు రుక్మిణి వసంత్, మురళీకాంత్ దేవసోత్, వాల్ పోస్టర్ సినిమా కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.