-
యంత్రాంగమంతా ఢిల్లీలోనే
-
బెంగాల్ తరహా ఫార్ములా..
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : తెలంగాణలో మరింత యాక్టివ్ కావాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ఉన్నది రెండేళ్లు మాత్రమే కావడంతో సర్వశక్తులు వడ్డాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ అని ఇదివరకే ప్రకటించింది. బెంగాల్లో అపూర్వ విజయంతో అదే స్ఫూర్తితో తెలంగాణలో అడుగు పెట్టాలని భావిస్తోంది. ఇక ఢిల్లీ యంత్రాంగం అంతా తెలంగాణలోనే పనిచేయనుంది. ఏదైనా రాష్ట్రంపై బిజెపి కన్నుపడితే.. మూడేళ్లు ముందుగానే కార్యాచరణ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో తన ప్రణాళిక ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి.. నెలాఖరు వరకు వరుస కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధపడింది.
-
యోధాను యోధులు..
భారతీయ జనతా పార్టీకి బలమైన నేతలు ఉన్నారు తెలంగాణలో. 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, బలమైన నేపథ్యం ఉన్న నాయకులు ఆ పార్టీలో కొదువ లేదు. కానీ ఈ బలం చాలదు అన్నట్టు ఉంది బిజెపి వ్యవహార శైలి. ఏదైనా రాష్ట్రంలో బలపడాలి అంటే బలమైన నేతలను పార్టీలోకి రప్పించుకుంటుంది బిజెపి. బెంగాల్లో సువేందు అధికారి లాంటి నేతలు ఇతర పార్టీలో బలమైన నేతలే. అయితే ఈ లెక్కన తెలంగాణలో సైతం భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేతలను రప్పించే ఏర్పాట్లు చేస్తోంది భారతీయ జనతా పార్టీ.
-
ప్రధాన ప్రతిపక్షం పై దృష్టి…
ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే బిజెపి ఒక ఫార్ములాను అనుసరిస్తూ ఉంటుంది. ముందుగా అక్కడ ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తుంది. తరువాత అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి వ్యూహం అదే. బలమైన భారత రాష్ట్ర సమితి నేతలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో వారిపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో గట్టిగానే దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని గమనించిన రేవంత్ రెడ్డి సైతం… ప్రతి అవినీతి కేసును విచారించే బాధ్యతను కేంద్రానికి విడిచి పెడుతున్నారు. దీంతో భారత రాష్ట్ర సమితి నేతలు బిజెపికి సరెండర్ అవుతున్నారు. ఒకవేళ బిజెపి చర్యలు తీసుకుంటే రాజకీయ ప్రత్యర్థి ఉండరు రేవంత్ రెడ్డికి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే భారత రాష్ట్ర సమితి బిజెపితో చేతులు కలిపిందన్న ప్రచారం చేసుకోవచ్చు. రేవంత్ ఆడుతున్న ఈ గేమ్ తో బిజెపి పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి భారత రాష్ట్ర సమితి నేతల చేరిక వాయిదా పడవచ్చు కానీ.. మున్ముందు భారీ ఆకర్ష్ ఉండనుంది తెలంగాణలో బిజెపి నుంచి. ఆపై బిజెపి యంత్రాంగం మొత్తం బెంగాల్లో దిగనుంది. సాధారణ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఒడిసి పట్టనుంది యంత్రాంగం. బెంగాల్లో ఎలాంటి సక్సెస్ ఫార్ములాను అనుసరించారో.. అదే ఫార్ములా తో తెలంగాణలో తన సరికొత్త రాజకీయం ప్రారంభించనుంది బిజెపి. చూడాలి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో..