-
అధికారుల అండతోనే ఈ ఆగడాలా?
రంగారెడ్డి నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) : రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్‌ది ఆదిభట్ల పరిధిలోని మంగళపల్లిలో ఉన్న ‘రాఘవేంద్ర హోటల్, యాజమాన్యం ప్రజల ప్రాణాలతో బహిరంగంగానే చెలగాటమాడుతోంది. తాజాగా ఈ హోటల్లో విక్రయించిన బట్టర్ మిల్క్ లో ఈగలు ప్రత్యక్షమవ్వడం, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కలుషిత మజ్జికను తాగిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురై, వాంతులు చేసుకోవడంతో వారిని తక్షణమే చికిత్స నిమిత్తం, లిమ్స్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ దారుణ సంఘటన రాఘవేంద్ర హోటల్ యాజమాన్యం యొక్క బరితెగింపును, నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది.
-
గతంలో హెచ్చరించిన క్రైమ్ మిర్రర్..మారని నైజం.
రాఘవేంద్ర హోటల్లో జరుగుతున్న ఆహార నాణ్యతా లోపాలు, కల్తీ, అపరిశుభ్ర వాతావరణంపై గతంలోనే ‘క్రైమ్ మిర్రర్’ అనేక పరిశోధనాత్మక వార్తా కథనాలను ప్రచురించి, ప్రజలను అధికారులను హెచ్చరించింది. అయినప్పటికీ హోటల్ యాజమాన్యంలో ఎటువంటి మార్పు రాలేదు సరి కదా, తమ అక్రమాలను, తప్పులను సమాజం ముందు ఉంచినందుకు ‘క్రైమ్ మిర్రర్’ పత్రికపై, ప్రతినిధులపై సదరు హోటల్ నిర్వాహకులు కక్షగట్టారు. నిజాలను వెలికితీసినందుకు పగను పెంచుకుని, తమ తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి, సమర్దించుకునే ప్రయత్నం చేయడం వారి అహంకారానికి అద్దం పడుతోంది.!
-
నిర్లక్ష్యపు సమాధానాలు.. సాక్ష్యాల మాయం!
తాజా సంఘటనలో బట్టర్ మిల్క్‌లో ఈగలు రావడాన్ని గమనించిన బాధితులు, కస్టమర్లు హోటల్ యజమానిని నిలదీయగా.. బాధ్యతారాహిత్యంగా, అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తప్పు ఒప్పుకోవాల్సింది పోయి దురుసుగా ప్రవర్తించారు. తాము దొరికిపోతామనే భయంతో సంఘటన జరిగిన వెంటనే, క్యాన్లలో ఉన్న బట్టర్ మిల్క్‌ను సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా పారబోసి, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేయడం గమనార్హం.!
-
ఫైన్ల పేరిట అధికారుల మామూళ్ల పర్వం? ప్రజల ప్రాణాలకు వెల ఎంత?
ఈ ఘటన అనంతరం అధికారులు సదరు హోటల్లో తనిఖీలు చేసినట్లు, నామమాత్రపు చర్యలు చేపట్టారు. అయితే, ఇలాంటి తీవ్రమైన సంఘటనలు జరిగినప్పుడు కేవలం వేలల్లో జరిమానాలు వేసి, చేతులు దులుపుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అధికారుల చర్యలు చూస్తుంటే వారు హోటల్ యాజమాన్యానికి, పరోక్షంగా అండగా నిలుస్తున్నారనే అనేక అనుమానాలకు దారి తీస్తోంది. కేవలం ఫైన్ల పేరిట ప్రజల ప్రాణాలకు వెల కడుతున్నారా? అధికారుల మామూళ్ల కక్కుర్తి వల్లే హోటల్ యాజమాన్యం ఇంతలా రెచ్చిపోతోందా? అనే ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.
-
అధికారులు చలించాలి.. హోటల్‌ను తక్షణమే సీజ్ చేయాలి!
ఇలాంటి హోటళ్ల వల్ల సామాన్య ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఫుడ్ సేఫ్టీ విభాగం తక్షణమే స్పందించాలని, నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టకుండా, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, నిజాలు రాసిన జర్నలిస్టులపై పగ పెంచుకుంటున్న, రాఘవేంద్ర హోటల్‌ను తక్షణమే సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ లైసెన్స్‌ను రద్దు చేసి, యజమానులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధితులు స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.