తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ మాజీ నేత కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు అంగీకరించలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం, మహిళలను వివాదాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
చెన్నైలో సోమవారం జరిగిన ‘ఇండియా టుడే రౌండ్‌టేబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కనిపిస్తోందని అన్నారు. అయితే కొందరు నేతలు ఇప్పటికీ పాత తరహా రాజకీయాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, రాజకీయ అంశాల్లో మహిళల పేర్లను ప్రస్తావించడం వంటి విధానాలను ఆయన తప్పుబట్టారు.
ఇటీవల కావేరీ జలాల అంశంపై జరిగిన ఆందోళన సందర్భంగా డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే అన్నామలై చేసిన మహిళలను రాజకీయ వివాదాల్లోకి తీసుకురావద్దన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకోవడంపైనా అన్నామలై స్పందించారు. విజయ్ రాజకీయ ప్రవేశం రాష్ట్రంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి స్పష్టమైన రాజకీయ దార్శనికత అవసరమని అభిప్రాయపడ్డారు.
అలాగే తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న నేతలను వెంటనే ‘బీజేపీ బీ-టీమ్’ అంటూ ముద్ర వేయడం సరికాదని అన్నామలై అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పును అర్థం చేసుకుని రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
also read: ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో హైడ్రామా.. రైల్వే సిబ్బందిపై బ్లేడ్‌తో మోడల్ దాడి!
