Homeతెలంగాణనకిలీ కొడుకుగా నమ్మించి రూ.41 లక్షలకు టోకరా.. వయసు తేడాతో బట్టబయలు

నకిలీ కొడుకుగా నమ్మించి రూ.41 లక్షలకు టోకరా.. వయసు తేడాతో బట్టబయలు

క్రైమ్ మిర్రర్  : 23 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ కుమారుడిగా ఓ వ్యక్తిని పరిచయం చేసి, వృద్ధ దంపతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన మోసపూరిత ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నకిలీ కొడుకుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇబ్రహీంపట్నం ఏసీపీ కెవీపీ రాజు, సీఐ మద్ది మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లక్ష్మారెడ్డి, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి 19 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియలేదు.

ఇటీవల ఈ విషయం తెలుసుకున్న ఫకీర్ మోహన్‌రెడ్డి.. నకిరేకల్‌కు చెందిన రేవల్లి యాదయ్యను శ్రీనివాస్‌రెడ్డిగా చూపించి వృద్ధ దంపతులను నమ్మించేందుకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. చెరువుగట్టు వద్ద సాధువు వేషంలో ఉన్న యాదయ్యను దంపతులకు పరిచయం చేసి, అతడే వారి తప్పిపోయిన కుమారుడని చెప్పినట్లు వెల్లడించారు.

అనంతరం యాదయ్యకు మాల ఉందని, దానిని తొలగించేందుకు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పి రూ.40 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నకిలీ కొడుకుగా చూపించిన వ్యక్తి కుమార్తె అనారోగ్యంతో ఉందని, చికిత్స కోసం మరో రూ.లక్ష అవసరమని చెప్పి మొత్తం రూ.41 లక్షలు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.

అయితే నకిలీ కొడుకుగా వచ్చిన వ్యక్తి వ్యవహారశైలిపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. దీంతో అతడి వయసును ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యుల ప్రకారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుత వయసు 43 ఏళ్లు కాగా, యాదయ్య వయసు 59 ఏళ్లుగా గుర్తించారు. దీంతో అతడు తమ కుమారుడు కాదనే అనుమానం మరింత బలపడింది. కుటుంబ సభ్యులు డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తామని చెప్పడంతో యాదయ్య వెనక్కి తగ్గినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఫకీర్ మోహన్‌రెడ్డి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ కెవీపీ రాజు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధ దంపతులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు కాజేసేందుకు జరిగిన ప్రయత్నంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
also read : ఆలయంపై ఆధిపత్యం కోసం ఇద్దరు సాధువుల హత్య.. నిందితుడి అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు