రైలులో సీటు విషయంలో మొదలైన చిన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ మహిళా మోడల్ రైల్వే సిబ్బందిపై బ్లేడ్‌తో దాడి చేయడంతో ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్రలోని థానేకు చెందిన 31 ఏళ్ల మోడల్ అంతరా బెనర్జీని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 12న రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
వెబ్‌సిరీస్ షూటింగ్ కోసం సూరత్ వెళ్తున్న అంతరా బెనర్జీ.. స్లీపర్ క్లాస్ టికెట్‌తో రైలులోని ఏసీ కోచ్‌లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఓ ప్రయాణికుడికి కేటాయించిన సీటులో ఆమె కూర్చోవడంతో వివాదం మొదలైంది. సీటు ఖాళీ చేయాలని ఆ ప్రయాణికుడు కోరినా ఆమె స్పందించకపోవడంతో టికెట్ చెకర్‌కు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న టీసీ హరికేష్ త్రిపాఠి అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే మాటామాటా పెరగడంతో అంతరా తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు పోలీసుల కేసు వివరాల్లో పేర్కొన్నారు.
పరిస్థితి అదుపు తప్పడంతో టీసీ.. ఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ యామిని కాంత్ మిశ్రా, కానిస్టేబుల్ రాజేష్ కుమార్‌లను అక్కడికి పిలిపించారు. అనంతరం అధికారులతో కూడా ఆమె వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె తన దుస్తులు తొలగించి, తన వద్ద ఉన్న రేజర్ బ్లేడ్‌తో ఏఎస్ఐ మిశ్రా, టీసీపై దాడికి ప్రయత్నించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమె తనకు తాను కూడా గాయాలు చేసుకున్నట్లు సమాచారం.
గందరగోళం నేపథ్యంలో రైల్వే సిబ్బంది బోగీ తలుపులు మూసివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అంతరా కిటికీ అద్దాన్ని పగలగొట్టి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
చివరకు దహాను రైల్వే స్టేషన్ వద్ద ఆమెను అదుపులోకి తీసుకుని జీఆర్‌పీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో మహిళా అధికారిణి యూనిఫాం దెబ్బతినడంతో పాటు ఫోన్, కళ్లజోడు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం తదితర ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అంతరా బెనర్జీని బెయిల్‌పై విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
also read: అనసూయపై కేసు.. తగ్గేదేలే అంటున్న నటి! ‘నా మాటలకు కట్టుబడే ఉన్నా’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్
