ఆధారాలు లేవా? చెరిపేశారా?
కేసు క్లోజ్ అంటున్న సీబీఐ
అనుమానాలున్నాయంటున్న కుమార్తె సునీత
ఏడేళ్ల పోరాటానికి దక్కని ఫలితం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఆయన మాజీ ముఖ్యమంత్రి సోదరుడు.. మరో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్.. ఆపై రాష్ట్రానికి మాజీ మంత్రి.. మాజీ ఎంపీ తో పాటు ఎమ్మెల్యే కూడాను. అటువంటి వ్యక్తి హత్యకు గురై ఏడు సంవత్సరాలు అవుతోంది. కానీ ఎంతవరకు మాత్రం నిందితులకు శిక్ష పడలేదు. హత్య కేసు తేలలేదు. దేశంలోనే అత్యంత హై ప్రొఫైల్ కేసు ఇది. ఒక సాధారణ హత్య కేసును గంటల వ్యవధిలోనే చేధిస్తున్నారు.
అటువంటిది దేశంలోనే అతిపెద్ద కేసు ఇది. కానీ ఛేదించలేకపోతున్నారు. నిందితులను శిక్షించలేకపోతున్నారు. తాజాగా సిబిఐ కూడా తాము ఏమి చేయలేమని .. ఇంతటితో విచారణ ముగిసింది అన్నట్టు చేతులెత్తేసింది. కొత్తగా ఎవరిని దర్యాప్తు చేయలేమని.. అందుకు తగ్గట్టు ఆధారాలు లేవని కూడా స్పష్టం చేసింది. ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టే.
ఏడేళ్ల కిందట ఘటన…
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయం అది. తొలుత గుండెపోటుగా వార్తలు వచ్చాయి. కానీ దారుణ హత్య చేసినట్లు బయటపడింది. అయితే దీనిని రాజకీయ హత్యగా చిత్రీకరించారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఇది హత్యగానే పేర్కొన్నారు. అప్పట్లో ఎన్నికలు కావడంతో ఈ అంశం ఒక కుదుపు కుదిపేసింది.
రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం అడ్వాంటేజ్ గా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా పతాక శీర్షికన కథనాలు రాసింది. నారా సుర రక్త చరిత్ర అంటూ రాసిన కథనాలు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పటి టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సిబిఐ దర్యాప్తు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు వేగవంతం అవుతుందని అంతా భావించారు.
కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ నుంచి సిబిఐ ను తప్పించాలని చూశారు. కానీ ఈ ప్రయత్నాన్ని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అడ్డుకున్నారు. న్యాయ పోరాటం చేసి సిబిఐ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. అప్పుడు అర్థమయింది ఈ కేసులో రాజకీయ ప్రత్యర్థుల కంటే… రాజకీయ పెత్తనం కోసం సొంత కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి.
కుమార్తె న్యాయ పోరాటం …
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ ఈ కేసులో ఆధారాలు లభించలేదు. ఆధారాలతో పాటు సాక్షాలను చెరిపేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన కేసులు, నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కాకుండా.. అసలు సూత్రధారులు, పాత్ర దారులు ఉన్నట్లు సునీత చెబుతున్నారు. వారిపై విచారణ చేపట్టాల్సిందేనని కోరుతూ వచ్చారు. కానీ విచారణ ముందుకెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు.
మధ్యలో ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో ఆధారాలతో పాటు సాక్షాలను చెరిపేసారన్న ఆరోపణలు ఉన్నాయి. సునీత అనుమానిస్తున్న వ్యక్తుల పాత్ర, వాటికి సంబంధించిన ఆధారాలు, ఆనవాళ్లు సిబిఐ కి దొరకడం లేదు. దీంతో తాము లోతైన దర్యాప్తు చేశామని.. కానీ వారు దొరకడం లేదని సిబిఐ చెబుతోంది.
అనేక రకాల అనుమానాలు…
ఒక హత్య జరిగితే వెంటనే దానికి కారణాలను, నిందితులను ఎక్కడున్నా పట్టుకునే దర్యాప్తు అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో మిస్టరీని ఎందుకు చేదించలేకపోతున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి ఆధారాలు ఉన్నా.. ఏమాత్రం సాంకేతికమైన చిన్న క్లూ లభించినా అధికారులు వదిలిపెట్టి ప్రశ్న ఉండదు. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మాత్రం అలా జరగలేదు. సొంతమనుసులు పాలకులుగా ఉన్నారు. సొంత మనుషులే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు.
అయినా సరే ఈ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. సొంత కుమార్తె వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయడం లేదు. దీంతో దర్యాప్తు సంస్థలపై కూడా ప్రజలకు దురాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి వారికే న్యాయం జరగకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉద్భవించక మానదు. వివేకానంద రెడ్డి ది సహజ మరణం కాదు. కానీ అందుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియకపోవడం మాత్రం నిజంగా దురదృష్టకరమే
