Homeక్రైమ్చిట్యాల జాతీయ రహదారిపై కత్తిపోటు కలకలం..!

చిట్యాల జాతీయ రహదారిపై కత్తిపోటు కలకలం..!

  • లిఫ్ట్ ఇచ్చిన పాపానికి డ్రైవర్‌పై ప్రాణాంతక దాడి.

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- నల్లగొండ జిల్లాలో ఘోర కలియుగం చోటుచేసుకుంది. ఆపదలో ఉన్నాడని కనికరించి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి, ఓ డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగుడు, కత్తితో ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. చిట్యాల సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై, జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

​ఘటన వివరాల్లోకి వెళ్తే….

​నల్లగొండకు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి, తన కారులో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో నార్కెట్‌పల్లి ప్రాంతానికి చేరుకోగానే, రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక గుర్తుతెలియని వ్యక్తి, (ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌కు చెందిన నిందితుడిగా అనుమానం), లిఫ్ట్ కావాలని సైగ చేశాడు.

మానవత్వంతో ఇమ్రాన్ కారు ఆపి, అతడిని ఎక్కించుకున్నాడు. ​కారు చిట్యాల పరిధిలోకి చేరుకోగానే, వెనుక సీట్లో కూర్చున్న సదరు వ్యక్తి తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.

హఠాత్తుగా తన వద్ద ఉన్న కత్తిని తీసి ఇమ్రాన్ మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇమ్రాన్ దగ్గర ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్, నగదును లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించగా, ఇమ్రాన్ తీవ్రంగా ప్రతిఘటించాడు.

​తీవ్ర గాయాలతో ఆసుపత్రికి…!

​డ్రైవర్ డిఫెన్స్ చేయడంతో రెచ్చిపోయిన దుండగుడు, ఇమ్రాన్ మెడ, చేతులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇమ్రాన్ కారును నిలిపివేసి కేకలు వేశాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే, నిందితుడు చీకట్లోకి పరారయ్యాడు.

​స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఇమ్రాన్‌ను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

​పోలీసుల రంగప్రవేశం – గాలింపు చర్యలు…!

​సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం..
నిందితుడు హిందీ మాట్లాడే వ్యక్తిగా, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవాడిగా ప్రాథమికంగా గుర్తించారు.

హత్యాయత్నం, దోపిడీ ప్రయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న సిసిటివి ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు పారిపోయిన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసుల ​హెచ్చరిక..!

జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం ప్రమాదకరమని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు