Crime Mirror Latest Updates: దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. యూపీఐ వినియోగిస్తూ వివిధ రకాల అవసరాలను తీర్చుకుంటున్న వినియోగదారుల సంఖ్య దేశంలో పెరుగుతుంది. తాజాగా మే నెలలో 30 లక్షల కోట్ల రూపాయల విలువచేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ దేశంలో జరిగాయి. ఇదే యూపీఐ లావాదేవీల్లో గరిష్టం కావడంతో రికార్డు సృష్టించినట్టు అయింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయుల డిజిటల్స్ చెల్లింపులు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నెల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా రూ.29.9 లక్షల కోట్ల విలువైన 3,320 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన రూ.29.03 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.87 వేల కోట్లు ఎక్కువ. గడిచిన ఏడాది మేతో పోల్చిన ఇది 19 శాతం అధికంగా ఉంది.
గడిచిన ఏడాది మే నెలలో రూ.4.76 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఏడాది దానికంటే అధికంగా భారీ స్థాయిలో లావాదేవీలు జరగడం గమనార్హం. లావాదేవీలు పరమానపరంగా చూస్తే ఈ ఏడాది మే నెలలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డును సృష్టించినట్లు ఎన్పీసీఐ పేర్కొంది. గడిచిన ఏడాది మే నెలలో 1867 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, ఈ ఏడాది మే నెలలో 24% వృద్ధిరేటుతో 2,320 కోట్లకు చేరాయి.
యూపీఐ లావాదేవీలు పెరుగుదలకు కారణం ఇదే..
గత నెల రికార్డు స్థాయి యూపీఐ లావాదేవీల పెరుగుదలకు అనేక అంశాలు కారణం అయినట్లు చెబుతున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో వివిధ రకాల ప్రయాణాలు చేస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో డిజిటల్ ట్రాన్జక్షన్స్ ఎక్కువగా చేస్తుండటం వలన పెరిగినట్లు ఎన్పీసీఐ అంచనా వేస్తోంది.
అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఒకరకంగా కారణంగా చెబుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన ప్రదేశాల్లో పెద్ద ఎత్తున యూపీఐ వినియోగం పెరిగింది. టికెట్లు కొనుగోలు నుంచి, ఆయా మైదానాలు వద్ద అవసరమైన తినుబండారాలు, ఇతర వస్తువులు కొనుగోలుకు పెద్ద ఎత్తున యూపీఐ వినియోగించడం కూడా ఈ స్థాయిలో లావాదేవీలు జరగడానికి కారణంగా అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో వినియోగదారులు సీజనల్ గా చేసే కొనుగోళ్లు ఈ స్థాయిలో యూపీఐ లావాదేవీల పెరుగుదలకు కారణం అవుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనా తర్వాత భారత్లో గణనీయంగా యూపీఐ వినియోగం పెరిగింది. నగద రహిత లావాదేవీలు చేసేందుకే వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు జేబులో పర్సు ఉంటే తప్ప బయటకు వెళ్లలేని ఎంతోమంది.. డిజిటల్ ట్రాన్సాక్షన్ కు అలవాటు పడిన తర్వాత పర్సులను క్యారీ చేయడమే మరిచిపోయారు. ఇవన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.