క్రైం మిర్రర్ : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ మహిళ నీటి సంపులో దూకడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఎనుముల మహేష్, శిరీష (23) దంపతులకు మానశ్రీ (3), నాలుగు నెలల వర్షిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిరీష తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసి, అనంతరం తాను కూడా అందులోకి దూకినట్లు ప్రాథమిక సమాచారం.
కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఏమిటి, కుటుంబ సమస్యలేమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
also read : ప్రేమ పేరుతో వేధింపులు..బస్సు ఎక్కిన యువతిని వెంటాడి దాడి